Mahabubnagar: ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Mahabubnagar police nab criminals duping as IPS officer CV Anand
  • 9  నెలలుగా మోసాలకు పాల్పడుతున్న ముఠా
  • ఉద్యోగాల పేరుతో 12 మంది నుంచి రూ. 28 లక్షల వసూలు
  • రెండు బైక్‌లు, రెండు తులాల బంగారం స్వాధీనం
ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లా గొంతుమార్చి మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హన్వాడకు చెందిన ప్రధాన నిందితుడు అక్కపల్లి చంద్రశేఖర్ అలియాస్ చందు, గండీడ్ మండలం నంచర్లకు చెందిన దొమ్మరి రవి, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన మాదాసు బాలయ్య, మాదాసు తేజ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ గొంతును అనుకరించి మాట్లాడుతూ గత 9 నెలలుగా వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. జడ్చర్లకు చెందిన ఓ బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ. 6.5 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆయన ఆరోపించారు.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న మహబూబ్‌నగర్ శివారులోని అప్పన్నపల్లి బ్రిడ్జి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇప్పటి వరకు ఇలా 12 మంది నుంచి రూ. 28 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Mahabubnagar
CV Anand
Crime News

More Telugu News