JC Diwakar Reddy: నేను వస్తున్నానని తెలుసుకుని పారిపోయారు... మళ్లీ వస్తా: గనుల శాఖ కార్యాలయం వద్ద జేసీ దివాకర్ రెడ్డి ఉగ్రరూపం

  • తాడిపత్రి గనుల శాఖ కార్యాలయానికి వచ్చిన జేసీ
  • గనుల శాఖ ఏడీ లేకపోవడంతో ఆగ్రహం
  • కార్యాలయం ఎదుట నిరసన
JC Diwakar Reddy gets anger after Mining Department AD absence

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ తాడిపత్రి గనుల శాఖ కార్యాలయానికి వచ్చారు. అయితే జేసీ వచ్చిన సమయానికి కార్యాలయంలో గనుల శాఖ ఏడీ లేరు. దాంతో జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. తాను వస్తున్నట్టు తెలుసుకుని ఏడీ పారిపోయారని వ్యాఖ్యానించారు. తాను మళ్లీ సోమవారం వస్తానంటూ స్పష్టం చేశారు.

ముచ్చుకోటలో జేసీ కుటుంబానికి చెందిన సున్నపురాయి క్వారీల్లో గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే జేసీ గనుల శాఖ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఏడీ లేకపోవడంతో మండిపడ్డారు. కార్యాలయం ఎదుట నిరసనకు దిగి పోలీసుల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పోలీసులకు సైతం హెచ్చరికలు చేశారు.

కాలం మారుతోందని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పోలీసులు ట్రాన్సఫర్లకు బయపడి ఊడిగం చేస్తున్నారని, పోలీసులు ఇలా బానిసల్లా ఎందుకు బతుకుతున్నారో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. "మా ప్రభుత్వం వస్తే... మేం కాదు, మా కార్యకర్తలే మీ సంగతి చూసుకుంటారు. చాలా తొందర్లోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వస్తుంది... అప్పుడు వచ్చే పాలకులు ఇప్పటివాళ్లకన్నా నాలుగింతలు దుర్మార్గులు వస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి?

ఓ నియంత చెప్పినట్టు చేస్తున్నారు, ఆ నియంత ఎంతకాలం ఉంటాడో తెలుసా? ముస్సోలిని, హిట్లర్ వంటి మహామహులైన నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు మాకు సన్మానం చేసిన అధికారులు త్వరలో అంతకు రెట్టింపు సన్మానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా నా తమ్ముడ్ని టార్గెట్ చేశారు... ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. ఇన్నాళ్లు నన్నెందుకు వదిలిపెట్టారో!" అంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News