Nirmal District: బైక్‌పై వెళ్తున్న ప్రేమ జంటను కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నం

lovers attacked by girl family members in Nirmal dist
  • నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఘటన
  • పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు పగ
  • కారుతో ఢీకొట్టిన అనంతరం కర్రలతో దాడి
తెలంగాణలో మరో ప్రేమజంటపై దాడి జరిగింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను, ప్రియుడిని హతమార్చేందుకు ప్రయత్నించారు. బైక్‌పై వెళ్తుండగా కారుతో వెనక నుంచి ఢీకొట్టారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. భైంసాకు చెందిన నాగజ్యోతి, అక్షయ్‌లు గతేడాది మే 28న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నెల రోజుల క్రితం తల్లికి గుండెనొప్పి వచ్చిందని నాగజ్యోతికి కబురు చేయడంతో ఆమె తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లింది. ఇంటికొచ్చిన ఆమెను విడాకులు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు బలవంతం చేశారు. తమ మాట వినకుంటే అక్షయ్‌ను చంపేస్తామని బెదిరించి ఈ ఏడాది ఆగస్టులో విడాకులు ఇప్పించారు. విడాకులు తీసుకున్నప్పటికీ నాగజ్యోతి, అక్షయ్‌ల మధ్య మాటలు కొనసాగుతున్నాయి.

కల్లూరులోని వాసవి కళాశాలలో డిగ్రీ పరీక్షలు రాసేందుకు బుధవారం నాగజ్యోతి వెళ్లింది. పరీక్షల అనంతరం అక్షయ్‌తో కలిసి బైక్‌పై వస్తుండగా నాగజ్యోతి ముగ్గురు సోదరులు వారిని కారుతో వెంబడించారు. బిజ్జూరు, చింతల్‌బోరి గ్రామాల మధ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం అక్షయ్‌పై కర్రలతో దాడిచేశారు. ప్రమాదంలో నాగజ్యోతికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Nirmal District
Bhainsa
Lovers
Attack
Crime News

More Telugu News