Ram Vilas Pashwan: దేశం గొప్ప దార్శనికత ఉన్న నేతను కోల్పోయింది: పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందన

President and Prime Minister condolences to Ram Vilas Pashwan demise
  • అనారోగ్యంతో కేంద్రమంతి పాశ్వాన్ మృతి
  • విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
  • పాశ్వాన్ కు ప్రజాసంక్షేమమే ముఖ్యమన్న రాష్ట్రపతి
  • పాశ్వాన్ కఠోర శ్రమతో ఎదిగారన్న ప్రధాని
కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పాశ్వాన్ మరణంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. పాశ్వాన్ మృతితో దేశం ఒక గొప్ప దార్శనికత ఉన్న నాయకుడ్ని కోల్పోయిందని రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా క్రియాశీలక సేవలు అందించిన వారిలో పాశ్వాన్ ఒకరని కొనియాడారు. బలహీన వర్గాల తరఫున బలంగా గళం వినిపించారని, బడుగు వర్గాల సమస్యలపై మడమతిప్పని పోరాటం చేశారని కీర్తించారు.

యువతలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోషలిస్టు అని, ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి మహోన్నతుల మార్గదర్శకత్వంలో ఎదిగారని రామ్ నాథ్ కోవింద్ కొనియాడారు. పాశ్వాన్ కు ప్రజలతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎల్లప్పుడూ వారి సంక్షేమం తప్ప మరేమీ పట్టదన్నట్టుగా వ్యవహరించేవారని తెలిపారు. ఈ విషాద సమయంలో పాశ్వాన్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

భుజం భుజం కలిపి పాశ్వాన్ తో పనిచేయడం గొప్ప అనుభూతి: ప్రధాని మోదీ

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పాశ్వాన్ కఠోర శ్రమ, పట్టుదలతోనే రాజకీయాల్లో ఎదిగారని, కుర్రాడిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ దిగ్గజాలతో పోరాడిన ధీరుడు అని అభివర్ణించారు. అద్భుతమైన పార్లమెంటు సభ్యుడు, మంత్రి అంటూ కొనియాడారు. అనేక రంగాల్లో చిరస్మరణీయ సేవలు అందించారని కీర్తించారు.

పాశ్వాన్ తో భుజం భుజం కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి అని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. కేబినెట్ సమావేశాల్లో ఆయన ప్రతిపాదనలు ఎంతో దూరదృష్టితో కూడినవని కితాబునిచ్చారు. పాశ్వాన్ రాజకీయ మేధస్సు, రాజనీతిజ్ఞత, పాలన దక్షత ఉన్నతమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, మద్దతు దారులకు సంతాపం తెలుపుకుంటున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.

Ram Vilas Pashwan
President Of India
Ram Nath Kovind
Prime Minister
Narendra Modi

More Telugu News