Cinema Theaters: సినిమా థియేటర్లకు కేంద్రం విడుదల చేసిన ప్రత్యేక మార్గదర్శకాలు ఇవే!

Centre releases guidelines for cinema halls
  • అక్టోబరు 15 నుంచి థియేటర్ల పునఃప్రారంభం
  • కెపాసిటీలో సగం కంటే తక్కువగా ప్రేక్షకులకు అనుమతి
  • సీట్ల ఏర్పాటులో భౌతికదూరం తప్పనిసరి
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతోంది. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా హాళ్లు కూడా మూతపడ్డాయి. లాక్ డౌన్ సడలింపులను దశలవారీగా ప్రకటిస్తూ వచ్చిన కేంద్రం ఇటీవలే సినిమా ప్రదర్శనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రకటించింది. అయితే, ఇప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉండడంతో థియేటర్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

థియేటర్ యాజమాన్యాలకు సూచనలు

  •  సినిమా హాలు సీటింగ్ కెపాసిటీలో సగం కంటే తక్కువ అంటే 50 శాతం కంటే తక్కువ సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలి.
  • సీట్ల ఏర్పాటులో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. భౌతికదూరం విధానంలో సంబంధిత సీట్లపై 'ఇక్కడ కూర్చోవద్దు' అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
  • సినిమా హాల్లోకి ప్రేక్షకులు ప్రవేశించే ముందు థర్మల్ స్కానర్ తో వారిని పరీక్షించాలి.
  • శానిటైజర్, హ్యాండ్ వాష్ లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
  • ఒకే కాంప్లెక్స్ లో పలు స్క్రీన్లు ఉంటే వాటిలో సినిమా ప్రదర్శనల సమయాలు వేర్వేరుగా ఉండాలి.
  • సినిమా హాలు సిబ్బందికి పీపీఈ కిట్లు, గ్లోవ్స్, బూట్లు, మాస్కులు తప్పనిసరిగా ఇవ్వాలి. సిబ్బంది భద్రత కోసం కూడా శానిటైజేషన్ చేస్తుండాలి.
  • సినిమా హాలు లోపల ఉష్ణోగ్రత 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చూడాలి.
  • టికెట్లు విక్రయించే కౌంటర్ లో తరచుగా క్రిమిసంహారకాలతో శుభ్రపరచాలి. ఈ కౌంటర్లను రోజంతా తెరిచే ఉంచాలి. ప్రేక్షకుల రద్దీని నివారించడం కోసం ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
  • అడ్వాన్స్ బుకింగ్ విధానం అమలు చేయాలి. ఆన్ లైన్, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలి.

ప్రేక్షకులకు మార్గదర్శకాలు

  • కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులు థియేటర్లకు రాకూడదు. వైరస్ లేని వ్యక్తులే సినిమా హాళ్లలో ప్రవేశించాలి.
  • ఒకవేళ లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే స్వయంగా తమ పరిస్థితిని హాలు సిబ్బందికి తెలియజేయాలి.
  • సినిమా థియేటర్ ప్రాంగణంలో ఉమ్మివేయడం నిషిద్ధం.
  • ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులు బయట తిరగరాదు.
  • కరోనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
  • సినిమా ప్రారంభంలోనూ, ఇంటర్వెల్ లోనూ, చివరిలో కరోనాపై ప్రకటనలు ఉంటాయి.
Cinema Theaters
Halls
Corona Virus
Guidelines
India

More Telugu News