P Jayaram: భూములు కొట్టేశారంటూ టీడీపీ నేతల ఆరోపణలు.. ఏపీ మంత్రి జయరాం స్పందన

  • అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారు
  • ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను
  • నిజాలు తెలుసుకుని మాట్లాడాలి
  • నేను అచ్చెన్నాయుడిలా అవినీతికి పాల్పడలేదు
jayaram slams tdp leaders

కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా ప్లాంటేషన్‌ కంపెనీ భూముల విషయంలో ఏపీ మంత్రి జయరాంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇట్టినా కంపెనీకి సంబంధంలేని మంజునాథ్ అనే వ్యక్తిని కీలుబొమ్మ‌గా చేసుకుని ఆయన 450 ఎకరాలు కొట్టేశారని వారు అంటున్నారు.

మంత్రి జయరాం బెదిరించి భూములు లాక్కున్నారని, బాధితులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఇటీవలే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. వీటిపై జయరాం స్పందించారు. ఈ రోజు ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ... పదవిని కోల్పోయిన అయ్యన్న పాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు.

ఆయన చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన నిజాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమి కొనుగోలు చేశారని, అయితే, అనంతరం ఆస్తి పంపకాల్లో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పుకొచ్చారు.

తాను అన్నీ తనిఖీ చేయించి 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేశానని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరు తన దగ్గరికి వచ్చి పలు అంశాలపై మాట్లాడారని, దీంట్లో అవకతవకలు ఉన్నట్లు అనుమానం రావడంతో ఆస్పిరి పోలీసు ‌స్టేషన్‌లో 420 కేసు కూడా పెట్టానని తెలిపారు. ఒక రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతలా ఎలా ఎదిగాడో అయ్యన్న పాత్రుడు ప్రశ్నించాలని ఆయన వ్యాఖ్యానించారు.

తాను అచ్చెన్నాయుడిలా అవినీతికి పాల్పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని డిస్పెన్సరీలను తనిఖీ చేశానని తెలిపారు. అయితే, వాటిల్లో ఔషధాలు లేవని తేలిందని, బాకీలు మాత్రం కట్టాల్సి వచ్చిందని వివరించారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు అదేశించానని తెలిపారు. విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు.

More Telugu News