కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్ లు అందించాలని కోరాం... ఇద్దరు సీఎంలు అంగీకరించారు: కేంద్రమంత్రి షెకావత్

06-10-2020 Tue 16:55
  • ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
  • హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • మీడియా సమావేశం నిర్వహించిన గజేంద్ర సింగ్ షెకావత్
Union minister Gajendra Singh Shekawat press meet after Apex Council meeting
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత షెకావత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించామని, మొత్తమ్మీద సమావేశం సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. ఇకపై సంవత్సరానికి ఓసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లు ఇవ్వాలని కోరామని, దీనికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ అంగీకరించారని షెకావత్ వెల్లడించారు. ఈ క్రమంలో అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు.

అంతేకాకుండా, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులపై చర్చించామని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆరేళ్లుగా ఇది అపరిష్కృతంగానే మిగిలిపోయిందని వివరించారు. అయితే, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయించాల్సింది కేంద్రమేనని, ఆ మేరకు నిర్ణయాధికారం కేంద్రానికి ఉందని ఉద్ఘాటించారు.

ఇక, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్టప్రకారమే వ్యవహరిస్తామని వెల్లడించారు. నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్ కు ఉందని అన్నారు.

అవసరమైన పక్షంలో నదీజలాలపై సుప్రీంకోర్టులో కేసును వెనక్కి తీసుకుంటామని, ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు నీరు కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరారని షెకావత్ తెలిపారు. ఈ విషయంలో తాము నిర్ణయం తీసుకోవాలంటే, ముందు తెలంగాణ కేసు ఉపసంహరించుకోవాల్సి ఉందని, ఆపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులపై రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి ట్రైబ్యునల్ ముందుంచుతామని వివరించారు.