Prithvi Raj Yarra: గాయంతో భువనేశ్వర్ కుమార్ ఔట్... తెలుగు క్రికెటర్ కు చోటు

  • చెన్నైతో మ్యాచ్ లో గాయపడిన భువీ
  • భువీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడన్న సన్ రైజర్స్
  • భువీ స్థానంలో పృథ్వీరాజ్ యర్రా
Prithvi Raj Yarra replaces injured Bhuvaneshwar Kumar in the rest of IPL matches

ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొడ కండరాల గాయానికి గురైన సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ మొత్తానికి వైదొలిగాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడని, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొంది. ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ లలో భువీ స్థానాన్ని పృథ్వీరాజ్ యర్రాతో భర్తీ చేస్తున్నామని సన్ రైజర్స్ వెల్లడించింది.

పృథ్వీరాజ్ యర్రా ఓ తెలుగు క్రికెటర్. రంజీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. 22 ఏళ్ల పృథ్వీరాజ్ ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. 2017లో దేశవాళీ క్రికెట్ లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.

2020 సీజన్ ఆరంభంలో ఒంగోలులో జరిగిన దేశవాళీ మ్యాచ్ లలో సౌరాష్ట్రపై 3, కేరళపై 6, హైదరాబాద్ జట్టుపై 6 వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన పృథ్వీరాజ్ 39 వికెట్లు తీశాడు. పృథ్వీరాజ్ స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల. పృథ్వీ ఐపీఎల్ గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కోల్ కతా జట్టు అతడ్ని రిలీజ్ చేయగా, వేలంలో సన్ రైజర్స్ దక్కించుకుంది.

More Telugu News