Tirumala: కల్యాణోత్సవం టికెట్లపై సీలింగ్... ఇకపై రోజుకి వెయ్యి టికెట్లు మాత్రమే అమ్మకం!

  • క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ
  • కల్యాణం టికెట్ కొని వారాంతంలో వస్తున్న భక్తులు
  • 15వ తేదీ వరకూ అమ్ముడుపోయిన టికెట్లు  
Sealing on Kalyanotsavam Tickets in Tirumala

కరోనా తరువాత, నియమ నిబంధనలతో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం తెరచుకోగా, రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయం తెరిచిన తొలినాళ్లలో 3 వేల నుంచి 5 వేల మంది వరకూ ఉన్న భక్తుల సంఖ్య, ఇప్పుడు 20 వేలు దాటిపోయింది. ఇక, ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టికెట్లను ప్రవేశపెట్టిన తరువాత, నిత్యమూ వేలాది మంది వీటిని కొనుగోలు చేస్తుండటంతో, భవిష్యత్తులో రద్దీ మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక కల్యాణోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తున్న టీటీడీ, టికెట్ కొనుగోలు చేసిన వారికి తదుపరి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కల్యాణోత్సవానికి డిమాండ్ పెరిగింది. ఈ నెల 3వ తేదీన శనివారం నాడు 4,300కు పైగా కల్యాణోత్సవం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక, శని, ఆది వారాల్లో గతంలో కల్యాణం చేయించుకున్న భక్తుల్లో దాదాపు 16 వేల మంది దర్శనానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణోత్సవం టికెట్లపై సీలింగ్ ను విధించారు. ఇకపై రోజుకు ఆన్ లైన్ లో 1000 కల్యాణం టికెట్లను మాత్రమే విక్రయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంచిన టికెట్లన్నీ అమ్ముడు పోయాయని వెల్లడించారు.ఆపై 16 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనుండటంతో, 10 రోజుల పాటు కల్యాణోత్సవ సేవను రద్దు చేశామని, తిరిగి 26 నుంచి సేవా టికెట్లను అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News