BJP: ప్రియాంక గాంధీపైనే చేయి వేస్తారా?: ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకురాలు

  • హత్రాస్‌ వెళ్తుండగా ఘటన
  • ప్రియాంకను నిలువరించేందుకు పోలీసు యత్నం
  • తీవ్ర విమర్శలు
bjp leader slams police

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో హత్యాచారానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రియాంక చేతిని పట్టుకుని ఓ పోలీసు ఆమెను ముందుకు రాకుండా నిలువరించడంపై బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షురాలు చిత్రా కిశోర్‌ వాగ్‌ మండిపడ్డారు.

మహిళా నాయకురాలి దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీసుకి ఎంత ధైర్యం? అంటూ ఆమె నిలదీశారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని ఆమె కోరారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

కాగా, హత్రాస్‌కు బయలుదేరిన కాంగ్రెస్‌ ప్రతినిధులను గ్రేటర్‌ నోయిడా వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి, లాఠీఛార్జ్‌ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు గాయాలు కాకుండా ప్రియాంక గాంధీ అడ్డుగా నిలిచేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఓ పోలీసు ప్రియాంక చేయి పట్టుకుని బలవంతంగా వెనక్కి పంపే ప్రయత్నం చేశాడు.

దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ మహిళా నేత కూడా ఈ ఘటనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే యూపీ గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపి, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

More Telugu News