Donald Trump: ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి, కారులో రౌండ్లు వేసిన ట్రంప్... వైద్య నిపుణుల విమర్శలు!

  • ప్రస్తుతం వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చికిత్స
  • బులెట్ ప్రూఫ్ కారులో బయటకు
  • మాస్క్ ధరించి కనిపించిన ట్రంప్
  • రాజకీయాల కోసం ఉద్యోగులను బలిపెడుతున్నారన్న విమర్శకులు
Trump Come out From Hospital amid Corona Treatment Not Completed

ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన చర్యలతో మరోసారి విమర్శలపాలయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన, కొవిడ్-19 ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, బయటకు వచ్చారు. బులెట్ ప్రూఫ్ కారులో రోడ్డుపై కలియ దిరుగుతూ, తన మద్దతుదారులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించి కనిపించారు.

కాసేపు బయట తిరిగిన తరువాత, ఆయన తిరిగి ఆసుపత్రిలోకి వెళ్లిపోయారు. కరోనా నెగటివ్ రాకుండానే ఆయన ఇలాంటి చర్యలకు దిగడాన్ని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. శరీరంలో వైరస్ ఉంటే, అది అనుక్షణం బయట వ్యాపిస్తూనే ఉంటుందని, ఈ కారణంగానే రోగులను ఐసోలేట్ చేస్తారని, చికిత్స సమయంలో ఇలా చేయడం సరికాదని అంటున్నారు.

కాగా, తాను బయటకు రావడానికి ముందు, ట్విట్టర్ ఖాతాలో మరో వీడియోను పోస్ట్ చేసిన ట్రంప్, "కొవిడ్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా స్కూలుకు వెళ్లినట్టుగా ఉంది" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సోషల్ మీడియా స్టంట్ ను ప్రారంభించారని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ట్రంప్ కాన్వాయ్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ 14 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ కు పంపనున్నామని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ చీఫ్ జేమ్స్ ఫిలిప్స్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ కారణంగా కాన్వాయ్, సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు, సెక్యూరిటీలోని ఎవరైనా అస్వస్థతకు గురై, చనిపోతే జవాబుదారీ ఎవరని, తన రాజకీయ అవసరాలకు ఉద్యోగులను బలిపెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి జూడ్ డీర్ మాత్రం ఈ విమర్శలను ఖండించారు. ట్రంప్ తో పాటు ఉన్న వారంతా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించే ఉన్నారని, మెడికల్ టీమ్ ఈ పర్యటన సురక్షితమని చెప్పిన తరువాతనే ఆయన బయటకు వచ్చారని అన్నారు.

More Telugu News