Akshay Kumar: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన అక్షయ్ కుమార్

  • సుశాంత్ మరణంతో కదిలిన డ్రగ్స్ తుట్టె
  • ప్రముఖ హీరోయిన్లను విచారించిన ఎన్సీబీ
  • ఇండస్ట్రీలో అందరూ దోషులు కారన్న అక్షయ్ కుమార్
  • వీడియో ద్వారా సందేశం
Bollywood hero Akshay Kumar opines on drugs issue

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నేపథ్యంలో బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరోయిన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారించడంతో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి నుంచి రాబట్టిన వివరాల మేరకు ఎన్సీబీ అధికారులు దీపిక పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లను విచారించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు.

"ఇవాళ నేను బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నాను. గత కొన్నివారాలుగా నా అభిప్రాయాలు చెబుదామనుకున్నా, ఎంతో ప్రతికూలత కనిపించింది. ఎవరికి చెప్పాలో, ఎంత మేరకు చెప్పాలో, అసలేం చెప్పాలో నాకు తెలియలేదు. ఇప్పటికీ మమ్మల్ని స్టార్లు అనే పిలుస్తున్నారు. ఇవాళ బాలీవుడ్ ఈ స్థాయిలో ఉందంటే అది మీ (ప్రేక్షకులు) అభిమానం వల్లే. మేం కేవలం ఓ పరిశ్రమ మాత్రమే కాదు, సినిమాలనే మాధ్యమం ద్వారా భారతీయ విలువలు, సంస్కృతిని ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రచారం చేస్తున్నాం. దేశంలోని ప్రజల సెంటిమెంట్లను సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి.

ఇవాళ మీరు కోపంగా ఉన్నారంటే ఆ కోపాన్ని మేం అంగీకరించాల్సిందే. సుశాంత్ మరణం తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల మీరు ఎంత బాధకు గురయ్యారో మేం కూడా అంతే బాధకు లోనయ్యాం. మన వద్ద ఏం జరుగుతోందని మనమే ఆశ్చర్యంతో తిలకించేలా ఇప్పటి పరిస్థితులు దారితీశాయి. చిత్ర పరిశ్రమలోని అనేక రుగ్మతలపై నిశితంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మనం డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితులేవీ ఇండస్ట్రీలో లేవని మీకు అబద్ధం చెప్పలేను. ప్రతి పరిశ్రమలోనూ, ప్రతి రంగంలోనూ ఉన్నదే. అయితే, ఇండస్ట్రీలో ప్రతి వ్యక్తి ఈ వ్యవహారంలో ఉన్నాడని చెప్పలేం. దీన్ని అందరికీ ఆపాదించలేం. అయినా అది సాధ్యమేనా? మాదక ద్రవ్యాల వ్యవహారం చట్టం పరిధిలోకి వస్తుంది. న్యాయ, చట్ట వ్యవస్థలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కచ్చితంగా సబబుగానే ఉంటుందని బలంగా నమ్ముతున్నాను.

చిత్ర పరిశ్రమలోని ప్రతి వ్యక్తి అందుకు సహకరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చేతులు జోడించి వేడుకుంటున్నాను... ఇండస్ట్రీలో ఉన్న అందరినీ అదే దృష్టితో చూడొద్దు. అందరూ దోషులే అని భావించడం సరైన పద్ధతి కాదు" అంటూ అక్షయ్ కుమార్ ఓ వీడియోలో తన సందేశం వెలువరించారు.

More Telugu News