Rahul Gandhi: నాటకీయ పరిణామాల మధ్య హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక!

Rahul Gandhi and Priyanka meets Hathras after high drama
  • తొలుత యూపీ బోర్డర్ లోనే అడ్డుకున్న పోలీసులు
  • ఆ తర్వాత యూపీ ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి
  • నలుగురు నేతలు మాత్రమే వెళ్లాలన్న కండిషన్ తో అనుమతి
అనేక నాటకీయ పరిణామాల మధ్య యూపీలోని హత్రాస్ మృతురాలి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కలిశారు. హత్రాస్ కు వెళ్తున్న వీరిని ఢిల్లీ-యూపీ సరిహద్దులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి సిల్వర్ కలర్ టయోటా కారులో వీరు బయల్దేరారు. కారును ప్రియాంక స్వయంగా డ్రైవ్ చేశారు. వీరు బయల్దేరిన కాన్వాయ్ లో దాదాపు 30 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వీరిలో సీనియర్ నేత శశిథరూర్ కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి హత్రాస్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

హత్రాస్ కు బయల్దేరే ముందు రాహుల్ మాట్లాడుతూ తనను అక్కడకు వెళ్లకుండా ఏ శక్తి అడ్డుకోలేదని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద దాదాపు 200 మంది పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు యూపీలోకి ప్రవేశించకూడదనే స్పష్టమైన ఆదేశాలు వారికున్నాయి. ఆ ప్రాంతంలో హెల్మెట్లు ధరించిన పోలీసులు, మెటల్ బ్యారికేడ్లు ఉన్న ఫోటోలు మీడియాలో వచ్చాయి.

ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో.. కాంగ్రెస్ నేతలకు పర్మిషన్ ఇచ్చింది. అయితే కేవలం నలుగురు మాత్రమే వెళ్లాలని షరతు విధించింది. దీంతో రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదురి మాత్రమే బోర్డర్ దాటి హత్రాస్ కు పయనమయ్యారు. కాసేపటి క్రితం హత్రాస్ చేరుకున్న కాంగ్రెస్ నేతలు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Rahul Gandhi
Priyanka Gandhi
Hathras
Congress

More Telugu News