Joe Biden: ట్రంప్ కు కరోనా సోకడంపై ప్రత్యర్థి జో బైడెన్ స్పందన

Joe Biden reacts after President Donald Trump and Melania Trump
  • నవంబరు 3న అమెరికాలో పోలింగ్
  • ట్రంప్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించిన బైడెన్
  • అధ్యక్షుడి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నామంటూ ట్వీట్
అమెరికాలో మరో నెల రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో నవంబరు 3న పోలింగ్ జరగనుంది. అయితే ట్రంప్, మెలానియా కరోనా బారినపడ్డారని తెలియగానే డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా త్వరగా కోలుకోవాలని తన అర్ధాంగి జిల్, తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామంటూ బైడెన్ ట్వీట్ చేశారు. దేశాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థిస్తూనే ఉంటామని తెలిపారు.

అంతకుముందు చేసిన ఓ ట్వీట్ లో మాత్రం బైడెన్... తన ప్రత్యర్థి ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. కరోనా నివారణలో తాను విఫలమయ్యానన్న వాస్తవం నుంచి దృష్టి మరల్చేందుకు ట్రంప్ ఏదైనా చేస్తాడని విమర్శించారు. 2 లక్షల మందికి పైగా అమెరికన్లు చనిపోయారని, 26 మిలియన్ల మంది ఉపాధి లేకుండా ఉన్నారని, ప్రతి 6 చిన్నతరహా వ్యాపారాల్లో ఒకటి శాశ్వతంగా మూతపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అతడిని మళ్లీ గెలిపించరాదని బైడెన్ స్పష్టం చేశారు.
Joe Biden
Donald Trump
Melania Trump
Corona Virus
Positive
Elections
USA

More Telugu News