Jeevan Reddy: దేవుడితో తర్వాత, చేతనైతే ముందు సీఎం జగన్ తో కొట్లాడు: సీఎం కేసీఆర్ పై జీవన్ రెడ్డి విసుర్లు

Congress MLC Jeevan Reddy fires on CM KCR over Krishna waters
  • జలాల తరలింపు ఆపే ధైర్యం సీఎం కేసీఆర్ కు లేదన్న జీవన్ రెడ్డి
  • కేసీఆర్ ప్రాంతీయ తత్వంతో రాజ్యం చేస్తున్నారని వ్యాఖ్యలు
  • ఇలాంటి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కృష్ణా జలాలు తరలిస్తూ ఉంటే ఆపే ధైర్యం లేని కేసీఆర్ దేవుడితో కొట్లాడతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు.

దేవుడితో తర్వాత, ముందు నీకు చేతనైతే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో కొట్లాడి కృష్ణా జలాల నీటి చౌర్యం ఆపాలి అంటూ సవాల్ విసిరారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను బలిచేస్తున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఇలాంటి నేతల పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలని అన్నారు.

రైతుల సంక్షేమానికి విఘాతం కలిగించే వ్యవసాయ బిల్లుల విషయంలో రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో ఎందుకు వ్యతిరేక తీర్మానం చేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రాంతీయ తత్వంతో రాజ్యం చేస్తుంటే, దేశంలో మోదీ మతోన్మాదం ప్రజ్వరిల్లజేసి పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు.

కేంద్రం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో తన బాధ్యత నుంచి తప్పుకుంటే, రాష్ట్ర సర్కారు నియంత్రిత వ్యవసాయం పేరుతో చేతులెత్తేసిందని వ్యాఖ్యానించారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Jeevan Reddy
KCR
Krishna River Waters
Jagan
Telangana
Andhra Pradesh

More Telugu News