Anurag Kashyap: మీటూ ఉద్యమాన్ని కూడా హైజాక్ చేస్తోంది.. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే: అనురాగ్ కశ్యప్
- మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటోంది
- న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటోంది
- పాయల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి
తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని, దుస్తులను తొలగించేందుకు యత్నించారని, లైంగిక దాడికి ప్రయత్నించారని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనురాగ్ ను నిన్న పోలీసులు విచారించారు. తాజాగా ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ను విడుదల చేశారు. తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని అన్నారు. మీటూ ఉద్యమాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయాలనుకుంటున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనురాగ్ తరపున ఈ కేసును చూసుకుంటున్న లాయర్ ప్రియాంక ఖిమానీ మాట్లాడుతూ... విచారణ సందర్భంగా కశ్యప్ ఒక డాక్యుమెంటరీ ఆధారాన్ని అందించారని చెప్పారు. 2013 ఆగస్ట్ మాసం మొత్తం ఒక సినిమా షూటింగ్ కోసం శ్రీలంకలోనే ఉన్నట్టు ఆధారాలు ఇచ్చారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను కశ్యప్ ఖండించారని చెప్పారు. కశ్యప్ ఇమేజీని డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేశారని అన్నారు. ఈ స్టేట్మెంట్ పై పాయల్ ఘోష్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.