Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌

US President Donald Trump and First Lady Melania Trump test positive for COVID19
  • ట్విట్టర్‌లో తెలిపిన ట్రంప్
  • క్వారంటైన్‌లో ఉంటామని వెల్లడి
  • ఇప్పటికే ఆయన ముఖ్య సలహాదారుకి కరోనా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. 'ఈ రోజు రాత్రి మెలానియాతో పాటు నాకు కరోనా నిర్ధారణ అయింది. మేమిద్దరం క్వారంటైన్‌లో ఉండనున్నాం.. కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటాం' అని ట్రంప్ వివరించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకినట్లు ఇప్పటికే తెలిసిన విషయం విదితమే. ఆమె అస్వస్థతకు గురి కావడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేశారు.

కాగా, అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తల నడుమ వైట్‌హౌస్‌ సిబ్బంది, వైద్యుల పర్యవేక్షణలో ఉండే డొనాల్డ్‌ ట్రంప్‌కి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చేనెల అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు కరోనా సోకడంతో తాను పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలను ట్రంప్ వాయిదా వేసుకున్నారు.
Donald Trump
USA
Corona Virus
COVID-19

More Telugu News