Vijayawada: విజయవాడలో పోలీసు కస్టడీలో ఉన్న యువకుడి మృతి

  • తెలంగాణ నుంచి మద్యం సీసాల అక్రమ రవాణా
  • అజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఆ తర్వాత కాసేపటికే మృతి
lockup death in vijayawada

విజయవాడలో దళిత యువకుడి లాకప్ డెత్ కలకలం రేపుతోంది. మద్యం అక్రమ రవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)  గత నెల 17న విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఆర్టీసీ కార్గో వాహనంలో అక్రమంగా తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. చేపలకు ఆహారంగా ఉపయోగించే ఫీడ్‌లో మద్యం సీసాలను పెట్టి గుప్తా అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వీటిని విజయవాడకు పార్సిల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై విజయవాడ పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆర్టీసీ కార్గో వాహనం నుంచి మొత్తం 28 అట్టపెట్టెలను స్వాధీనం చేసుకున్న పోలీసులు గుప్తా ఫోన్ నంబరు, కాల్ డేటా ఆధారంగా కృష్ణలంక పెద్దవారి వీధికి చెందిన కారు డ్రైవర్ అయిన డి.అజయ్ (26) మారుపేరుతో మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అజయ్‌, మొగల్రాజపురానికి చెందిన అతడి స్నేహితుడు సాయికిరణ్‌లను నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎస్‌ఈబీ కార్యాలయం నుంచి వారిని పటమట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తనకు ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరి ఆడడం లేదని, ఒళ్లు చల్లబడుతోందని పోలీసులకు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అజయ్ మృతిపై స్పందించిన పోలీసులు.. అతడు అనారోగ్య కారణాలతో మృతి చెందాడని, లాక్‌డెత్ కాదని స్పష్టం చేశారు.

More Telugu News