Air India One: భారత్ చేరుకున్న అత్యాధునిక లోహ విహంగం... ఎయిరిండియా వన్ కు ఘనస్వాగతం

Air India One lands on Delhi International Airport
  • రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం ఎయిరిండియా వన్
  • ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండింగ్
  • అనేక ఏర్పాట్లతో రూపుదిద్దుకున్న విమానం
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణాల కోసం ఉద్దేశించిన అత్యాధునిక విమానం ఎయిరిండియా వన్ భారత్ చేరుకుంది. అమెరికా నుంచి వచ్చిన ఈ విమానం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. మధ్యాహ్నం 3.11 గంటలకు ఈ విమానం ల్యాండైందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ విమానానికి ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.

అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం తరహాలో భారత్ కు కూడా ఓ విమానం ఉండాలన్న ఆలోచనతో కేంద్రం ప్రముఖ విమాన తయారీదారు బోయింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటివే రెండు విమానాలు అందించాలని పేర్కొంది. ఈ క్రమంలో ఎయిరిండియా సంస్థ తన వద్ద ఉన్న రెండు బీ-777 విమానాలను ఆధునికీకరణ కోసం డల్లాస్ లోని బోయింగ్ తయారీ కేంద్రానికి పంపింది.

భారత ప్రభుత్వ పెద్దల అవసరాలకు తగిన విధంగా బోయింగ్ సంస్థ ఓ బీ-777 విమానాన్ని ఎయిరిండియా వన్ విమానంగా తీర్చిదిద్దింది. ఇలాంటిదే మరో విమానాన్ని కూడా భారత్ లో వీవీఐపీల ప్రయాణాల కోసం ముస్తాబు చేస్తోంది. వాస్తవానికి తొలి విమానం నెలకిందటే భారత్ కు రావాల్సి ఉండగా, కొన్ని కారణాలతో ఆలస్యమైంది.

కాగా, ఎయిరిండియా వన్ విమానంలో క్షిపణి దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన అధునాతన వ్యవస్థలను పొందుపరిచారు. ఈ విమానంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. విశాలమైన కార్యాలయం, సమావేశ మందిరాలు, అత్యవసర సమయాల్లో అందించే వైద్య సేవలు ఎయిరిండియా వన్ లో ఏర్పాటు చేశారు. ఈ విమానం ఒక్కసారి ఇంధనం నింపుకుంటే భారత్ నుంచి అమెరికాకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించగలదు.
Air India One
New Delhi
Land
Boeing
USA
Prime Minister
Vice President
President Of India
India

More Telugu News