Nara Lokesh: పెన్షన్ల విషయంలో జగన్ గారి మోసాలు అన్నీ ఇన్నీ కావు: నారా లోకేశ్

  • రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు
  • అవ్వాతాతల పెన్షన్ పెంచకపోవడం దారుణం
  • పెన్షన్ పెంచామని అసత్య ప్రచారం చేస్తున్నారు
Jagan deceiving pensioners says Nara Lokesh

పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారి మోసాలు అన్నీ ఇన్నీ కావని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారని... ఆ తర్వాత మాట తప్పి, మడమ తిప్పి ప్రతి ఏటా రూ. 250 పెంచుతామని అన్నారని గుర్తు చేశారు. కానీ, జూలై నుంచి రూ. 2500 పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వ, తాత రూ. 1000 నష్టపోయారని చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ లో అవ్వాతాతల పెన్షన్ పెంపు లేకపోవడం దారుణమని అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము రూ. 200 పెన్షన్ ని రూ. 2వేలకు పెంచామని... వైసీపీ నేతలు మాత్రం రూ. 1000 పెన్షన్ ని రూ. 2250 చేశామని సిగ్గు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

30.5.2019న జగన్ గారు తొలి సంతకం చేసి జారీ చేసిన జీవో 103లో రూ. 2 వేల పెన్షన్ ని రూ. 2250కి పెంచుతున్నట్టు ఎందుకుందో చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను పెంచాలని... జూలై నుంచి ఉన్న బకాయిలు కూడా పెన్షనర్లకు చెల్లించాలని అన్నారు.

More Telugu News