రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత కుటుంబానికి బాలకృష్ణ ఆర్థిక సాయం

01-10-2020 Thu 16:57
Nandamuri Balakrishna helps a tdp leader family
  • ఇటీవల అనంతపురం జిల్లాలో మరణించిన నర్సింహప్ప
  • ఈ అంశాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లిన స్థానిక టీడీపీ నేతలు
  • వెంటనే స్పందించిన బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. కొన్నిరోజుల కిందట కోడూరు కాలనీకి చెందిన టీడీపీ నేత నర్సింహప్ప అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అతడి కుటుంబ పరిస్థితి పట్ల చలించిపోయిన బాలయ్య ఆర్థికసాయం ప్రకటించారు.

ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు నర్సింహప్ప కుటుంబ సభ్యులను కలిసి రూ.1.50 లక్షల విలువ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ బాండును బాలకృష్ణ తరఫున వారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మృతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన సాయం అందిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలంటూ సూచించారు.

అటు, స్థానిక టీడీపీ నేతలు కూడా తమ సహచరుడి కుటుంబానికి బాసటగా నిలిచారు. తమకు తోచిన రీతిలో ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా నర్సింహప్ప కుటుంబ సభ్యులు బాలకృష్ణకు, ఇతర టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.