నా నష్టం ఎవరు తీరుస్తారు?... ఇంత తప్పు చేయడానికి కారణం ఇదే: హీరోయిన్ సంజనా గల్రానీ

01-10-2020 Thu 08:46
Actress Sanjana Loss Money in IMA Scam
  • ఐఎంఏ అనుబంధ కంపెనీల్లో భారీ పెట్టుబడులు
  • తీవ్రంగా నష్టపోయానని విచారణలో చెప్పిన సంజన
  • బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నం

ఇటీవల వెలుగులోకి వచ్చిన శాండల్ వుడ్ డ్రగ్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన నటి సంజనా గల్రానీ, ఆ మధ్య వెలుగులోకి వచ్చిన ఐఎంఏ స్కామ్ లో నిండా మునిగిపోయిందట. తాను ఎంతో పెట్టుబడి పెట్టి నష్టపోయానని అధికారుల విచారణలో పేర్కొన్న ఆమె, తనకు జరిగిన నష్టాన్ని ఎవరు తీరుస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సంజనతో పాటు, రాగిణిద్వివేదిని కూడా కస్టడీలోకి తీసుకుని వారి ఇతర ఆస్తులు, పెట్టుబడులపై సీసీబీ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ స్కామ్ లో తాను ఎలా నష్టపోయానన్న విషయాన్ని సంజన వివరించింది.

ఐఎంఏ, దాని అనుబంధ కంపెనీలు, అధిక రాబడి ఆశ చూపుతూ కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించి, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా నష్ట పరిచాయి. తాను కూడా మంచి రిటర్నులు అందుకోవాలని భావిస్తూ, లక్షలు వెచ్చించి మోసపోయానని వెల్లడించింది. వీరిద్దరూ ఏవైనా హవాలా డీల్స్ జరిపించారా? అన్న విషయాన్ని విచారిస్తుంటే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ తరువాతనే తాను డ్రగ్స్ దందాలోకి దిగానని కూడా సంజన చెప్పినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. కాగా, వీరిద్దరి బెయిల్ పిటిషన్లను ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చగా, హైకోర్టును ఆశ్రయించాలని వారు భావిస్తున్నారు.