మహిళలపై మరింతగా పెరిగిన అత్యాచారాలు: కేంద్ర గణాంకాల వెల్లడి

30-09-2020 Wed 09:04
Rape Cases Hike in India
  • 7.3 శాతం వరకూ పెరిగిన నేరాలు
  • ప్రతి లక్ష మందిలో 62 మందిపై అత్యాచారం
  • బాలలపై 4.5 శాతం పెరిగిన వేధింపులు
  • ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు విడుదల

భారతావనిలో మహిళలపై అత్యాచారాలు గణనీయంగా పెరిగిపోయాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా గణాంకాల మేరకు, 2018తో పోలిస్తే, 2019లో రేప్ కేసులు పెరిగాయి. గత సంవత్సరం దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఏడాదిలో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి.

 'క్రైమ్స్ ఇన్ ఇండియా - 2019' పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్ష మంది మహిళల్లో 62.4 మంది అత్యాచారాలు, వేధింపులను ఎదుర్కొన్న వారేనని తెలిపింది. 2018లో మహిళలపై వివిధ రకాల నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019లో వాటి సంఖ్య 4,05,861కి పెరిగాయని పేర్కొంది.

వీటిల్లో రేప్ కేసుల సంఖ్య 32,559 నుంచి 33,356కు పెరిగాయని తాజా రిపోర్టు పేర్కొంది. ఇక వీటిలో అత్యధిక కేసుల్లో మహిళలు భర్త లేదా బంధువుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవేనని కూడా వెల్లడించింది. ఈ తరహా కేసులు 30.9 శాతం ఉండగా, మహిళలపై దాడులు, అత్యాచారాల కేసులు 21.8 శాతం ఉండగా, కిడ్నాప్ కేసులు 17.9 శాతం ఉన్నాయని ఎన్సీఆర్బీ పేర్కొంది.

మహిళలతో పాటు చిన్నారులపైనా వేధింపులు, దాడులకు పాల్పడిన కేసుల సంఖ్య గత సంవత్సరం పెరిగింది. 2018తో పోలిస్తే చిన్నారులపై నేరాల సంఖ్య 4.5 శాతం పెరిగి మొత్తం 1.48 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటిల్లో 46.6 శాతం కిడ్నాప్ కేసులు కావడం గమనార్హం. కాగా, ఈ నివేదికలో పశ్చిమ బెంగాల్ లో 2019లో జరిగిన నేరాలను మాత్రం చేర్చలేదు. ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని ఎన్సీఆర్బీ తెలియజేసింది.