LAC: ఈ పని చేస్తే ఒక్క సమస్య కూడా ఉండబోదన్న చైనా... కుదరదన్న ఇండియా!

  • వాస్తవ నియంత్రణ రేఖను తిరిగి నిర్వచిద్దాం
  • చైనా నుంచి వచ్చిన ప్రతిపాదన
  • నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ
India Rejects Chinas Offer on LAC

భారత్, చైనాల మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవ నియంత్రణ రేఖను కాస్తంత మారుద్దామని చైనా నుంచి ప్రతిపాదన రాగా, భారత్ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. లడఖ్ ప్రాంతంలో నియంత్రణ రేఖను సవరిద్దామని ఇటీవలి చర్చల్లో చైనా నుంచి ప్రతిపాదన రాగా, తిరస్కరించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

1959లో ఎల్ఏసీ విషయంలో బీజింగ్ నుంచి వచ్చిన నిర్వచనం, పరస్పర అంగీకారంతో చేసినది కాదని, దీనిపై ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా మరింత స్పష్టత ఇవ్వాలని భారత్ అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉంది. ఈ మేరకు అప్పట్లోనే భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భారత ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ, చైనా అధ్యక్షుడు చౌ ఎన్లాయ్ కి లేఖ కూడా రాశారు. ఈ విషయంలో భారత ఆలోచన, ఉద్దేశం ఎల్లప్పుడూ ఒకటేనని, చైనా మాత్రం ఎప్పటికప్పుడు మాట మార్చుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా ఆరోపించారు.

2003 వరకూ ఇరు దేశాలూ ఎల్ఏసీపై స్పష్టత ఇచ్చి, నియంత్రణ రేఖను తిరిగి నిర్వచించాలని ప్రయత్నించామని, చైనా మాత్రం సక్రమంగా స్పందించలేదని ఆరోపించిన కేంద్రం, తాజాగా చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై స్పందించింది. ఇటీవల చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ, ఎల్ఏసీని తిరిగి నిర్వచించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, 1959 ఒప్పందాన్ని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, లడఖ్ ప్రాంతంలోని పలు కీలక పోస్టులు తమవంటే, తమవని ఇండియా, చైనాలు క్లయిమ్ చేసుకుంటూ ఉండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతం హిమాలయాల పరిధిలో ఉండటం, చైనాకు ప్రతికూలంగా, ఇండియాకు అనుకూలంగా ఉండటంతో చైనా దిగిరాక తప్పలేదు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల తరువాత జరిగిన సైనిక స్థాయి చర్చల్లో శాంతిని కొనసాగించాలని, కవ్వింపు చర్యలకు దిగవద్దని మాత్రమే రెండు దేశాలూ ఒప్పందం చేసుకున్నాయి.

అయినా, ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం రెండు దేశాలూ తమవంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. గడచిన మే నెలలో జరిగిన ఘర్షణల్లో 20 మందికి పైగా భారత జవాన్లు వీరమరణం పొందిన తరువాత, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇందుకు చైనాయే కారణమని భారత్ ఆరోపిస్తుండగా, భారత చర్యలతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చైనా చెబుతోంది. ఇప్పుడు తాజాగా ఎల్ఏసీని తిరిగి నిర్వచించాలని చైనా ఏకపక్షంగా ప్రయత్నిస్తే అంగీకరించబోమని స్పష్టం చేసింది.

More Telugu News