అదృష్టమంటే ఈ వృద్ధురాలిదే... ఒక్క చేపతో జాక్ పాట్!

29-09-2020 Tue 22:05
Woman gets more money with a single huge fish
  • వేటకు వెళ్లిన వృద్ధురాలికి భారీ చేప లభ్యం
  • నీటిలో కొట్టుకొచ్చిన చేప
  • ఒక్కదుటున నీళ్లలో దూకి చేపను ఒడ్డుకు చేర్చిన వైనం
  • చేపకు రూ.3 లక్షలకు పైగా ధర

అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం! పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్ కు చెందిన పుష్పా కర్ అనే వృద్ధ మహిళను కూడా అదృష్టం అలాగే పలకరించింది. 24 పరగణాల జిల్లాలోని సుందర్బన్స్ ప్రాంతంలో ఆ వృద్ధురాలు ఎప్పట్లాగే చేపల వేటకు వెళ్లింది. ఇంతలో ఓ పెద్ద చేప నీటిలో కొట్టుకుని వస్తున్నట్టు గుర్తించి, అమాంతం నీళ్లలో దూకి దాన్ని అతి కష్టమ్మీద ఒడ్డుకు చేర్చింది.

ఇతర మత్స్యకారుల సాయంతో దాన్ని చేపల మార్కెట్ కు తీసుకెళ్లగా, అక్కడ దాని బరువు తూస్తే 52 కేజీలు అని తేలింది. ఆ చేపలోని కొన్ని భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. దాంతో కేజీ రూ.6,200 ధర పలికింది. ఆ విధంగా ఆమెకు రూ.3 లక్షలకు పైగా సొమ్ము చేతికందింది. ఒక్క చేపతో లక్షలు వచ్చిపడడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

వాస్తవానికి ఆ చేప సరైన స్థితిలో ఉన్నప్పుడు లభ్యమై ఉంటే అంతకంటే ఎక్కువ ధర వచ్చేదని స్థానికులు అంటున్నారు. ఆ భారీ చేపను ఓ నావ ఢీకొని ఉంటుందని, అందుకే ఆ చేప పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో వృద్ధురాలికి దొరికిందని తెలిపారు. ఈ చేప కొవ్వు, ఇతర అవయవాలను ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తారట.