Jagan: జనవరి కల్లా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది: సీఎం జగన్

  • కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • కరోనాతో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ
  • రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందని వెల్లడి
CM Jagan says corona vaccine will be out in January

ఏపీ సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశముందని అన్నారు. అప్పటివరకు కరోనాతో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామం అని పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల రేటు 12.0 నుంచి 8.3కి తగ్గిపోయిందని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్నా, కేసులు తక్కువ సంఖ్యలోనే వస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందనడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఇక, కరోనా చికిత్సపై మాట్లాడుతూ, కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి, ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు.

104 నెంబర్ కు డయల్ చేస్తే కరోనా టెస్టులు, సంబంధిత ఆసుపత్రుల వివరాలు అందాలని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు మాక్ కాల్స్ చేస్తూ ఈ నెంబర్ పనిచేస్తుందో లేదో పరిశీలిస్తుండాలని ఆదేశించారు. కరోనా బాధితులను వీలైనంత త్వరగా గుర్తించడం వల్లే మరణాల శాతం తగ్గించగలమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

More Telugu News