Chandrababu: నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట!: చంద్రబాబు

  • పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • నేరగాళ్లకు పోలీసులు వత్తాసు పలకరాదని హితవు
  • వైసీపీ అరాచకాలు చర్చనీయాంశం అయ్యాయని వ్యాఖ్యలు
Chandrababu video conference with party leaders

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో  రామచంద్రపై దాడి ఘటనకు రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ, డీఎస్పీ మొదట చెప్పారని, ఆ తర్వాత కుమార్ రెడ్డి పేరుకు బదులు ప్రతాప్ రెడ్డి పేరు తెచ్చారని ఆరోపించారు. వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉండాలి కానీ, నేరగాళ్లకు వత్తాసు పలకరాదని హితవు పలికారు.  

సీల్డ్ కవర్ లో సాక్ష్యాధారాలు పంపాలని డీజీపీ నాకు లేఖ రాయడం హాస్యాస్పదం అని స్పందించారు. నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. విచారణ బాధ్యత పోలీసులదా... ప్రతిపక్షానిదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నాయకులు, సీఎం బంధువులపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నారని, ఏ నేరం చేయకపోయినా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయా అంటూ మండిపడ్డారు. ఏపీలో వైసీపీ దారుణాలు జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయ్యాయని విమర్శించారు. దేవాలయాలపై ఇప్పటికీ దాడులు ఆగకపోవడం గర్హనీయం అని అన్నారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెల్లుబుకుతున్నా వైసీపీ బుద్ధులు మారడం లేదని పేర్కొన్నారు.

More Telugu News