Narendra Modi: ట్రాక్టర్ ని తగలబెట్టడం రైతులను అవమానించడమే!: మోదీ

Burning tractor is an insult to farmers says Modi
  • మంచి పనులను అడ్డుకోవడం కాంగ్రెస్ కు అలవాటు
  • పార్లమెంటు సమావేశాల్లో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చాం
  • వ్యవసాయ చట్టాలు రైతులకు స్వేచ్ఛను కల్పిస్తాయి
ప్రతి మంచి పనిని నిరసిస్తూ ఆందోళన చేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటుగా మారిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇండియా గేట్ వద్ద ట్రాక్టర్ ను దహనం చేయడంపై స్పందిస్తూ... ఈ చర్య ముమ్మాటికీ రైతులను అవమానించడమేనని అన్నారు.

ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సంస్కరణనలను తీసుకొచ్చామని మోదీ అన్నారు. తాము తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులు, యువత, మహిళలు, రైతులను శక్తిమంతులను చేస్తుందని చెప్పారు. అయితే, వీటిని కొందరు ఎలా వ్యతిరేకిస్తున్నారో యావత్ జాతి చూస్తోందని అన్నారు.

తమ ఉత్పత్తులను దేశంలో ఎవరికైనా, ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కొత్త చట్టంతో రైతులకు లభించిందని మోదీ చెప్పారు. రైతులకు వారి హక్కులను కేంద్రం కల్పిస్తోందని... ఇదే సమయంలో దాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ఓపెన్ మార్కెట్లో రైతులు వారి ఉత్పత్తులను అమ్ముకోవడం వారికి ఇష్టం లేదని అన్నారు. దళారులు బాగుపడాలనేదే వారి ఆలోచన అని దుయ్యబట్టారు. రైతుల స్వేచ్ఛను వారు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

నాలుగేళ్ల క్రితం మన సైనికులు పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తే... ఆధారాలు చూపించాలని విపక్షాలు అడిగాయని మోదీ మండిపడ్డారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకించాయని, ఆ తర్వాత భూమిపూజను అడ్డుకునే ప్రయత్నం చేశాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తారని చెప్పారు. ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే... మన దేశంలో కొందరు యోగాను వ్యతిరేకిస్తారని మండిపడ్డారు.
Narendra Modi
BJP
Congress
Farm Bills

More Telugu News