మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకున్న చరిత్ర సోమిరెడ్డిది... ఆయన్నుంచి మేం నేర్చుకోవాలా?: కాకాని గోవర్ధన్

29-09-2020 Tue 14:09
YSRCP MLA Kakani Govardhan Reddy fires in TDP leader Somireddy
  • సోమిరెడ్డి, కాకాని మధ్య మాటల యుద్ధం
  • రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోమిరెడ్డి
  • వరుసగా ఐదు సార్లు ఓడిపోయాడన్న కాకాని

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఇప్పటిది కాదు. గత కొన్నేళ్లుగా ఈ నెల్లూరు జిల్లా నేతల మధ్య రాజకీయ స్పర్ధ నడుస్తోంది. ఇటీవల వైసీపీ సర్కారుపై సోమిరెడ్డి విమర్శలు చేస్తూ, రైతుల సమస్యలపై తీవ్రంగా స్పందించారు. ధాన్యం మద్దతు ధరపైనా, మీటర్ల అంశంపైనా వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ ఘాటుగా బదులిచ్చారు. గతంలో మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకున్న చరిత్ర సోమిరెడ్డిదని అన్నారు. రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సోమిరెడ్డి మానుకోవాలని హితవు పలికారు. శాసనసభ ఎన్నికల్లో వరుసగా 5 పర్యాయాలు ఓడిపోయిన వ్యక్తి సోమిరెడ్డి అని, అటువంటి వ్యక్తి నుంచి మేం నేర్చుకోవాలా? అంటూ కాకాని ప్రశ్నించారు.