IPL 2020: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘సూపర్’ విన్.. ఐపీఎల్ అసలైన మజా అందించిన మ్యాచ్

  • ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్
  • ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయిన ఇషాన్  
  • సూపర్ ఓవర్‌లో బెంగళూరును వరించిన అదృష్టం
IPL 2020 RCB Won in Super Over

ఐపీఎల్‌లో మరో మ్యాచ్ ‘సూపర్’గా జరిగింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ‘సూపర్’ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించగా, ముంబై ఇండియన్స్ కూడా అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ అనివార్యం కాగా, బెంగళూరు విజయం సాధించింది.

బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), డికాక్ (14), సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్యా (15) వంటి హిట్టర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ముంబై ఓటమి ఖాయమని అందరూ భావించారు. అయితే, అప్పుడే మ్యాజిక్ జరిగింది. క్రీజులో పాతుకుపోయిన ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్‌లు అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ఇషాన్ కిషన్ 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుటయ్యాడు.

పొలార్డ్ అయితే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ పూర్తిగా ముంబై చేతుల్లోకి వచ్చేసింది. అయితే, 20వ ఓవర్ ఐదో బంతికి ఇషాన్ అవుటయ్యాడు. విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా, ఉడానా వేసిన బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ టై అయింది. 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో మ్యాచ్ విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ అవసరమైంది.  

సూపర్ ఓవర్‌లో ముంబై ఏడు పరుగులు మాత్రమే చేయగా, బెంగళూరు ఆ మాత్రం స్కోరును కూడా చివరి బంతి వరకు ఛేదించలేకపోయింది. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా, కోహ్లీ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కోహ్లీ మరోమారు తీవ్రంగా నిరాశపరచగా, దేవదత్ పడిక్కల్, ఫించ్‌లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. పడిక్కల్ 40 బంతుల్లో 2 సిక్సర్లతో 54 పరుగులు చేయగా, ఫించ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ దశలో జట్టు స్కోరు 170 పరుగులు దాటితే అదే ఎక్కువనుకుంటున్న సమయంలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ చెలరేగిపోయాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. మరోవైపు, శివం దూబే కూడా మెరుపులు మెరిపించాడు. 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్‌తో 27 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 200 దాటింది. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News