నాకు కరోనా సోకితే నేరుగా వెళ్లి బెంగాల్ సీఎంను కౌగలించుకుంటా: బీజేపీ జాతీయ కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

28-09-2020 Mon 19:16
BJP National Secretary Anupam Hazra comments on Mamata Banarjee
  • ఇటీవలే బీజేపీ జాతీయ పదవి అందుకున్న అనుపమ్ హజ్రా
  • రాష్ట్రంలో కరోనా లెక్కలు సరిగా చూపడంలేదని బీజేపీ విమర్శలు
  • మమతా బెనర్జీకి ప్రజల బాధ తెలిసేలా చేస్తానన్న హజ్రా

తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కౌగలించుకుంటానంటూ పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ నేత అనుపమ్ హజ్రా వ్యాఖ్యానించాడు. ఇటీవలే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించగా, ఆయన జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు.  

కరోనా వ్యాప్తి మొదలయ్యాక పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో అనుపమ్ హజ్రా... "నాకు కూడా ఏదో ఒక సమయంలో కరోనా సోకుతుంది. అప్పుడు నేరుగా వెళ్లి మమతా బెనర్జీని కౌగిలించుకుంటా. అప్పుడు ఆమెకు కూడా కరోనా వస్తుంది. అప్పుడు కానీ ప్రజలు పడుతున్న కష్టమేంటో ఆమెకు అర్థం కాదు. తమ వారిని కోల్పోయిన ప్రజల ఆవేదన అప్పటికి గాని ఆమెకు తెలిసిరాదు" అంటూ వ్యాఖ్యలు చేశారు.

అనుపమ్ హజ్రా వ్యాఖ్యలు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ విభాగం సిలిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.