SBI: సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు...ఖాతాదార్లను అప్రమత్తం చేసిన ఎస్బీఐ

SBI alerts customers about cyber frauds via Whatsapp calls and messages
  • లాటరీ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలన్న ఎస్బీఐ
  • సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దంటూ సూచన
  • తాము లాటరీ స్కీములు అమలు చేయడంలేదని వెల్లడి
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక సైబర్ నేరాలు కూడా అధికమయ్యాయి. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారంటూ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. లాటరీ గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్స్ చేస్తారని, మోసపూరితమైన సందేశాలు పంపుతారని తెలిపింది. ఫలానా ఎస్బీఐ నెంబర్ ను సంప్రదించాలంటూ నమ్మబలుకుతారని, ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఈమెయిల్, ఎస్సెమ్మెస్, ఫోన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా ఎప్పుడూ ఖాతాదార్ల వ్యక్తిగత వివరాలు అడగదని ఎస్బీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, లక్కీ కస్టమర్ గిఫ్టులు, లాటరీ స్కీములను తాము ఎక్కడా అమలు చేయడంలేదని, ఇలాంటి ప్రలోభాల్లో చిక్కుకునేముందు ఓసారి ఆలోచించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతాదార్లు చేసే తప్పుల కోసం సైబర్ క్రిమినల్స్ కాచుకుని ఉంటారని, ఇలాంటి ఫేక్ కాలర్స్ ను నమ్మరాదని, ఇలాంటి సందేశాలను ఎవరైనా ఫార్వార్డ్ చేసినా వాటిని విశ్వసించవద్దని బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ లో వెల్లడించింది.

SBI
Whatsapp
Cyber Criminals
Frauds
Lottery

More Telugu News