టాలీవుడ్ పెద్దల పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు: దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

28-09-2020 Mon 17:46
Drugs culture is there in Tollywood says Divyavani
  • ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉంది
  • టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చింది?
  • ఇండస్ట్రీలో డబ్బు ఉన్నవారిదే రాజ్యం

సినీ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ ఉందని అన్నారు. పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారని చెప్పారు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో గతంలో చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ తెలుగు మహిళ ఆధ్వర్యంలో 'తెలంగాణ మహిళా కమిషన్ ఆవశ్యకత - ఏర్పాటు' అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అవకాశాల కోసం దిగజారే జనాలు సినీ రంగంలో ఉన్నారని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేమిటని ప్రశ్నించారు. సినీ రంగంలో కూడా డబ్బు ఉన్నవారిదే రాజ్యమని చెప్పారు. సినీ రంగంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. తన కూతురు చదువుకుంటున్న హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు ఉన్నారని అన్నారు.