హిందూ మత పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు

28-09-2020 Mon 16:04
Raghurama Krishnaraju alleges on a big leader
  • తన దిష్టిబొమ్మల దహనానికి ఓ పెద్దనేత ఆదేశాలిచ్చారు 
  • మతం మార్చుకున్నా దళితులుగా కొనసాగుతున్నారంటూ వ్యాఖ్యలు
  • దళితులకు రిజర్వేషన్లలో నష్టం జరుగుతోందని వివరణ

హిందూమత పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న తనపై దాడి జరగబోతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గంలో తన దిష్టిబొమ్మలు తగులబెట్టాలంటూ ఓ పెద్ద నేత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసిందని వెల్లడించారు.

మతం మార్చుకున్నా గానీ దళితులుగా కొనసాగుతున్న కొద్దిమంది వల్ల అసలైన దళితులకు రిజర్వేషన్లలో నష్టం జరుగుతోందని చెప్పానని, అందుకే తనపై దాడులకు కుట్ర పన్నారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇది హిందుత్వంపై చేస్తున్న దాడిగా భావించాల్సిందేనని పేర్కొన్నారు. ఇటీవల కొంతకాలంగా ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ అగ్రనాయకత్వంతో ఢీకొంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, అందుకు ఆయన కూడా దీటుగానే బదులిస్తున్నారు.