సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించిన ప్రకాశ్ రాజ్... వీడియో ఇదిగో!

28-09-2020 Mon 15:20
Prakash Raj felicitated Sonu Sood on Alludu Adurs sets
  • లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ దాతృత్వం
  • వలస జీవుల పాలిట దేవుడిలా మారిన సోనూ సూద్
  • అల్లుడు అదుర్స్ సెట్స్ పై సోనూను అభినందించిన ప్రకాశ్ రాజ్

లాక్ డౌన్ సమయంలో అపర దాతగా పేరొందిన సినీ నటుడు సోనూ సూద్ ను నట దిగ్గజం ప్రకాశ్ రాజ్ ఘనంగా సన్మానించారు. అల్లుడు అదుర్స్ సెట్ లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. సోనూ సూద్ కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించిన ప్రకాశ్ రాజ్, ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో సోనూ సూద్ ఆపన్నులకు అందించిన సేవలను ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ కొనియాడారు. సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.

కేంద్రం కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వలస కార్మికులు, పేదల పాలిట తీవ్ర విఘాతంలా పరిణమించింది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వలసజీవులను వారి స్వస్థలాలకు చేర్చారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.