D Srinivas: కేసీఆర్ ప్రగతి భవన్ లో నన్ను అవమానించాడు: డి.శ్రీనివాస్

KCR insulted me says D Srinivas
  • తెలంగాణ రాష్ట్ర సాధనలో నా కృషి ఎంతో ఉంది
  • నాకు వ్యతిరేకంగా కవిత కుట్రలకు పాల్పడుతున్నారు
  • బీజేపీలోకి వెళ్లాలనుకుంటే నన్ను ఎవరూ ఆపలేరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అవమానించారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ... ప్రగతి భవన్ లో తనను అవమానించారని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో  తాను కీలక పాత్రను పోషించానని చెప్పారు. సోనియాగాంధీని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తనకే తెలుసని అన్నారు. తన కృషి ఎంతో ఉందనే విషయాన్ని కేసీఆర్ కూడా అనేక సార్లు చెప్పారని తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో ప్రాణాలను అర్పించారని చెప్పారు. కేసీఆర్ కేవలం ఓట్లు సాధించే రాజకీయం చేస్తుంటారని అన్నారు.

కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నానంటూ తనపై పార్టీ అధిష్ఠానానికి కవిత లేఖ రాశారని... ఆ లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో సగం మంది తనకు ఫోన్ చేశారని... ఒత్తిడి తట్టుకోలేకే లేఖపై సంతకం చేశామని చెప్పారని అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తను పని చేసినట్టైతే... తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీలోకి డీఎస్ వెళ్లాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులుగా ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి తాను వెళ్లాలనుకుంటే తనను ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉన్నానో పార్టీ హైకమాండే చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని దుష్ట శక్తుల వల్లే తాను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చిందని అన్నారు.
D Srinivas
KCR
TRS

More Telugu News