Lockdown: మారటోరియం ప్లాన్ ఏమిటి?... కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు!

  • లాక్ డౌన్ నుంచి మారటోరియం
  • మరికొంత కాలం పొడిగించే ఆలోచన
  • అక్టోబర్ 5లోగా ప్రణాళిక ఇవ్వాలని కోర్టు ఆదేశం
Supreem Court Give One Week time to Center to Submit Maratorium Plan

కరోనా మహమ్మారి ఇండియాలో విజృంభించడం మొదలైన తరువాత, లాక్ డౌన్ ప్రకటించిన వేళ, బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించి, రుణగ్రహీతల ఈఎంఐల చెల్లింపులపై తొలుత మూడు నెలలు, ఆపై మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ఇప్పటికే తీరిపోయింది. అయినప్పటికీ, మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు, స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఉదయం ఇదే కేసు విచారణకు రాగా, మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోరడంతో, వారం రోజుల గడువు ఇస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయి. రెండేళ్ల పాటు దీన్ని అమలు చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ కేసులో కేంద్రం, ఆర్బీఐ తరఫున ఈ ఉదయం విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని, మారటోరియం పొడిగింపుపై ప్రభుత్వ ఆలోచనను తెలిపేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది.

More Telugu News