Tirumala: మార్చి తరువాత తొలిసారిగా... నిన్న వెంకన్న హుండీ ఆదాయం రూ. 2.34 కోట్లు!

  • గత వైభవం దిశగా తిరుమల
  • ఆదివారం నాడు 12 వేల మందికి దర్శనం
  • అక్టోబర్ నెలలో మరింతగా పెరిగే అవకాశం
Tirumala Hundi Offerings Above 2 Crores

తిరుమల గిరులు క్రమంగా గత వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మార్చి మూడవ వారంలో లాక్ డౌన్ ప్రారంభమైన తరువాత, భక్తుల దర్శనాలకు అనుమతించిన టీటీడీ, ఆపై నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపై తొలిదశలో 3 వేల మందికిలోపే దర్శనాలు చేయించారు.

ఈ సమయంలో హుండీ ఆదాయం భారీగా పడిపోయి, రూ.50 లక్షల దిగువకు చేరింది. లాక్ డౌన్ కు ముందు రోజు వరకు రూ. 3 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భక్తుల సంఖ్యను అధికారులు క్రమంగా పెంచుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆదివారం నాటి హుండీ ఆదాయం, లాక్ డౌన్ తరువాత రూ.2 కోట్లను దాటింది. ఆదివారం నాడు 2.34 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, 12 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తాజాగా అక్టోబర్ నెలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయగా, టికెట్లన్నీ దాదాపు అయిపోయాయి.

కాగా, కరోనాను నివారించాలని స్వామిని కోరుతూ, తిరుమలలో 16 రోజుల పాటు సుందరకాండ దీక్ష జరుగనుంది. ఇందులో భాగంగా 2,821 శ్లోకాలను నిత్యమూ పఠించనున్నారు.

More Telugu News