IPL 2020: లక్ష్య ఛేదనలో రికార్డు సృష్టించిన రాజస్థాన్.. భారీ స్కోరు చేసినా ఓటమి తప్పించుకోలేకపోయిన పంజాబ్

  • షార్జాలో పరుగుల వాన
  • చెలరేగిపోయిన ఇరు జట్లలోని బ్యాట్స్‌మెన్
  • ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదు
Royals complete highest run chase after Tewatia turnaround

క్రికెట్‌లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, మనదైన రోజున ఎవరూ ఆపలేరని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. పంజాబ్ తమ ఎదుట ఉంచిన కొండంత లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలోని బ్యాట్స్‌మెన్ శివాలెత్తిపోయారు. షార్జాలో పరుగుల వాన కురిపించారు. దీంతో ఇరు జట్లలోని బౌలర్లు పరుగులు భారీగా సమర్పించుకున్నారు. 85 పరుగులు చేసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ చెలరేగి ఆడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లు స్టేడియంలో పరుగుల తుపాను సృష్టించారు. బౌలర్లు బంతి వేయడమే ఆలస్యం అన్నట్టు దానిని స్టాండ్స్‌లోకి పంపించారు. కెప్టెన్ రాహుల్ అండతో మయాంక్ వీర విహారం చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు రాజస్థాన్ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. చివరికి 17వ ఓవర్ మూడో బంతికి మయాంక్ అవుటయ్యాడు. భారీ షాట్‌కు యత్నించిన మయాంక్, శాంసన్‌కు దొరికిపోయాడు. దీంతో 183 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 50 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు.

మరోవైపు, ఆ తర్వాత కాసేపటికే రాహుల్ కూడా అవుటయ్యాడు. 54 బంతులు ఆడిన రాహుల్ 7 ఫోర్లు, సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 194 పరుగులు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ కూడా మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు. మ్యాక్స్‌వెల్ 13 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రాజ్‌పుత్, టామ్ కరన్ చెరో వికెట్ తీసుకున్నారు.

కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ మొదలుపెట్టిన రాజస్థాన్ 19 పరుగుల వద్దే ఓపెనర్ జోస్ బట్లర్ (4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్‌తో కలిసి కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత శాంసన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. స్టేడియం నలువైపులా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో 100 పరుగుల వద్ద స్మిత్ అవుటయ్యాడు. 27 బంతులు ఆడిన స్మిత్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి జట్టును విజయం దిశగా ముందుకు నడిపించిన శాంసన్ మూడో వికెట్‌గా వెనుదిరగడంతో రాజస్థాన్ అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా సంచలన ఇన్నింగ్స్‌తో విజయాన్ని దగ్గర చేశాడు. వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు.

31 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. చివరికి విజయానికి రెండు పరుగుల ముందు అవుటైనప్పటికీ అప్పటికే జట్టు విజయానికి చేరువకావడంతో ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ ఆ పని పూర్తి చేశారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగా, ఆరువికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్థాన్  అద్వితీయ విజయాన్ని అందుకుంది.

రాబిన్ ఉతప్ప 9, జోఫ్రా అర్చర్ 13, టామ్ కరన్ 4 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ డకౌట్ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, కాట్రెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. నేడు దుబాయ్‌లో బెంగళూరు, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

More Telugu News