కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి

27-09-2020 Sun 15:00
Chiranjeevi recalls his memories when he had worked as Tourism minister
  • ఇవాళ టూరిజం డే
  • గతంలో కేంద్ర పర్యాటక మంత్రిగా పనిచేసిన చిరు
  • చిరు వీడియో పోస్టు చేసిన అభిమాని
  • ముగ్ధుడ్నయ్యానన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ఆయన నాటి యూపీఏలో భాగస్వామి అయ్యారు. ఇవాళ టూరిజం డే సందర్భంగా ఓ అభిమాని చిరంజీవి కేంద్రమంత్రిగా పనిచేసిన క్షణాలను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆ వీడియోను చూసి చిరంజీవి భావోద్వేగాలకు గురయ్యారు. ఓ అభిమాని పంచుకున్న వీడియో తనను ఎంతో ముగ్ధుడ్ని చేసిందని తెలిపారు.

'ఇంక్రెడిబుల్ ఇండియా' కార్యక్రమం కోసం తాను అందించిన సేవలు, ఎన్నో సంతృప్తికర క్షణాలను మరోసారి స్మరించుకుంటున్నానని పేర్కొన్నారు. దేశ సౌందర్యాన్ని నలు దిక్కులా ప్రచారం చేసేందుకు తనకు పరిమిత సమయం మాత్రమే లభించినా, తన అత్యుత్తమ సేవలు అందించానని చిరంజీవి వెల్లడించారు. మంత్రి పదవికి సంబంధించి ఎంతో సంతృప్తి చెందుతున్నానని, కాలాతీత జ్ఞాపకాలు అందుకున్నానని తెలిపారు.