France: ఫ్రాన్స్ లో కరోనా రెండో తాకిడి... ఊహించిన దానికంటే వేగంగా వచ్చేసిందన్న వైద్య నిపుణులు

France witnesses corona virus second wave
  • ఫ్రాన్స్ లో బాగా ప్రభావం చూపిన కరోనా
  • మరోసారి అధికస్థాయిలో వస్తున్న కరోనా కేసులు
  • గత 24 గంటల్లో 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రాన్స్ లో ఇటీవల కొంతకాలంగా తగ్గినట్టు కనిపించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. దీనిపై ఫ్రెంచ్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ రెండో తాకిడి అనుకున్నదానికంటే వేగంగా వచ్చేసిందని వారు పేర్కొన్నారు.

ఫ్రాన్స్ లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ డాక్టర్స్ చీఫ్ పాట్రిక్ బోయట్ మాట్లాడుతూ, కరోనా మళ్లీ దేశంలో వ్యాప్తి చెందుతుందని భావించాం కానీ, మళ్లీ ఇంత త్వరగా వచ్చేస్తుందని అనుకోలేదని తెలిపారు. ఫ్రాన్స్ ఆరోగ్యమంత్రి ఒలివర్ వెరాన్ చేసిన హెచ్చరికలు ఏమంత ప్రభావవంతంగా లేవని, మరో మూడు, నాలుగు వారాలు పరిస్థితిలో మార్పు రాకుంటే శీతాకాలం మొత్తం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుందన్న సంగతి ఆయన చెప్పలేదని పాట్రిక్ బోయట్ అన్నారు.

దేశం మొత్తం మళ్లీ కరోనా ప్రబలితే వైద్య సిబ్బంది సరిపోరని, డిమాండ్ కు తగిన వైద్యసేవలు అందించేందుకు వీలు కాకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే వైద్య సిబ్బంది అలసిపోయారని వెల్లడించారు. ఫ్రాన్స్ లో గత 24 గంటల్లో 14,412 కొత్త కేసులు వచ్చాయి. దాంతో అక్కడి అధికార యంత్రాంగం మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతోంది.
France
Corona Virus
Second Wave
Positive Cases

More Telugu News