వాజ్ పేయి లేరు... ఆయన ఎన్డీయే లేదు: హర్ సిమ్రత్ కౌర్ కీలక వ్యాఖ్యలు

27-09-2020 Sun 09:26
Har simrat Sensational Comments on NDA
  • ఎన్డీయేను దూరదృష్టితో వాజ్ పేయి ప్రారంభించారు
  • ఇప్పుడు ఆ ఎన్డీయే లేనే లేదు
  • ట్విట్టర్ లో హర్ సిమ్రత్ కౌర్ 

ప్రస్తుత భారతావనిని ఏలుతున్నది నాడు ఏబీ వాజ్ పేయి దూరదృష్టితో ప్రారంభించిన ఎన్డీయే కాదని, ఇప్పుడున్నది రైతు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్డీయే నుంచి ఎస్ఏడీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే హర్ సిమ్రత్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "మూడు కోట్ల మంది పంజాబీల బాధ, నిరసనలు విఫలమయ్యాయి. ఇప్పుడు భారతావనిని ఏలుతున్నది వాజ్ పేయి, బాదల్ ప్రారంభించిన ఎన్డీయే కాదు. ఈ కూటమి తన దీర్ఘకాల మిత్రుడి బాధను వినని చెవిటిది అయిపోయింది. ఈ ఎన్డీయే కళ్లు గుడ్డివి. దేశానికి అన్నం పెడుతున్న వారి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు" అని మండిపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్ నుంచి రాజీనామా చేసిన వారం రోజుల తరువాత హర్ సిమ్రత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకుని వచ్చినప్పటి నుంచి తమ వ్యతిరేకతను చెబుతూనే ఉన్న శిరోమణి అకాలీదళ్, ఈ బిల్లులను ఆమోదించిన తరువాత, తమ తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆపై దేశవ్యాప్తంగా రైతు నిరసనలకు విపక్ష పార్టీలతో కలిసి ఎస్ఏడీ సైతం చేతులు కలిపింది. తాజాగా ఎన్డీయే నుంచి శాశ్వతంగా బయటకు వస్తున్నట్టు ప్రకటించింది.