China: పాక్ నుంచి కొత్త సమస్య... సరిహద్దుల్లో కొత్తగా గన్ పాయింట్స్, చైనా డ్రోన్లు!

  • పాక్ కు పూర్తిగా సహకరిస్తున్న చైనా
  • పాక్ కు అత్యాధునిక ఆయుధాలు అందిస్తున్న చైనా
  • హెచ్చరించిన నిఘా వర్గాలు
  • పట్టుబడిన ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు
China Helping Pakistan Terrorists

ఓ వైపు చైనా నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమస్య, మరోవైపు దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులతో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న వేళ, దీర్ఘకాల శత్రువు పాకిస్థాన్ నుంచి కొత్త సమస్య వచ్చి పడిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు చైనా కూడా తనవంతు సహకారాన్ని అందిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా ఆదేశాల మేరకు పాకిస్థాన్ సరిహద్దుల్లో కొత్తగా గన్ పాయింట్స్ ను ఏర్పాటు చేసుకుంది. ఇదే సమయంలో చైనా నుంచి తీసుకున్న మానవ రహిత విమానాలను పెద్దఎత్తున అందుకుని, వాటితో రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.

నిఘా వర్గాల సమాచారం మేరకు, పాక్ స్పై ఏజన్సీ ఐఎస్ఐ కి చైనా నుంచి ఆదేశాలు అందాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోకి భారీ ఎత్తున ఆయుధాలను తరలించాలని చైనా సూచించడంతో, అందుకు తగ్గట్టుగా పాక్ సన్నాహాలు ప్రారంభించింది. ఇటీవలి కాలంలో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం కార్యకలాపాలు పెరిగిపోయాయి. వీరి వెనుక చైనా కూడా ఉంది. అందుకు తొలి సాక్ష్యం, ఇటీవల జమ్మూకశ్మీర్ లో పట్టుబడిన సైన్యం వద్ద చైనాలో తయారైన ఆయుధాలు లభించడమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నివేదికలను పరిశీలించిన తరువాత, పాక్ సరిహద్దుల్లో మరింత నిఘాను పెట్టాలని హోమ్, విదేశాంగ, విదేశీ వ్యవహారాల శాఖలకు ఆదేశాలు అందగా, సైన్యాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఆపై బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్ర పెద్దలకు వివరిస్తూ, అప్రమత్తంగా ఉండాలని సైన్యానికి హెచ్చరికలు పంపుతున్నట్టు వెల్లడించాయి.

ఇక పాకిస్థాన్ వేసిన మరో కొత్త ప్లాన్ ఏంటంటే, సరిహద్దులు దాటుతున్న వారి వద్ద ఒక్క ఆయుధం కూడా ఉండటం లేదు. ఇదే సమయంలో వారు హద్దులు దాటుతూ ఉంటే, సైనికుల దృష్టిని మరల్చేలా కాల్పులు కూడా జరపడం లేదు. పాకిస్థాన్ సైన్యం, ఇండియాలోకి ఉగ్రవాదులను పంపడానికి తన మార్గాల్ని కూడా మార్చుకుంటోందని, ఇదే ఇప్పుడు ఆందోళనకరమని నిఘా వర్గాలు కేంద్రానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, చైనాకు చెందిన నోరిన్కో సంస్థ తయారుచేసిన ఈఎంఐఈ టైప్ 97 ఎన్ఎస్ఆర్ రైఫిల్స్ ఇటీవల మట్టుబెట్టిన, ఉగ్రవాదుల వద్ద రికవరీ కావడం గమనార్హం.

More Telugu News