ముక్కలు ముక్కలుగా నరుకుతా.. సత్తెనపల్లి వ్యాపారికి అంబటి రాంబాబు పేరుతో బెదిరింపులు

25-09-2020 Fri 08:56
  • హనుమప్రసాద్ భూమిని కబ్జా చేసేందుకు యత్నం
  • ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిన వ్యాపారి
  • ఆడియో రికార్డుతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
Sattenapalli business man gets threat calls in the name of Ambati Rambabu

వైసీపీ నేత అంబటి రాంబాబు పేరుతో తనకు బెదిరింపులు వస్తున్నట్టు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యాపారి పెరుమాళ్ల హనుమప్రసాద్ ఆరోపించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి తనను ఫోన్‌లో బెదిరించారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆడియో రికార్డును అందించినట్టు తెలిపారు.

నరసరావుపేట రోడ్డులో తనకు 11 సెంట్ల భూమి ఉందని, దానిని కబ్జా చేసేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ విషయాన్ని వెల్లడించినట్టు హనుమప్రసాద్ వివరించారు. దీంతో శ్రీనివాసరెడ్డి తనకు అర్ధరాత్రి అంబటి రాంబాబు పేరుతో ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టినందుకు అంతు చూస్తానని బెదిరించాడని, రోడ్డు దగ్గరకు వస్తే ముక్కలుగా నరికేస్తానని హెచ్చరించాడని ఆరోపించారు.

ఈ భూమి వ్యవహారంతో అంబటి రాంబాబుకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన పేరుతో బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు. కాగా, హనుమప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.