మహేశ్ బాబు నిర్మిస్తున్న చిత్రంలో బాలీవుడ్ భామ!

24-09-2020 Thu 17:32
  • అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమా 
  • మహేశ్ బాబు బ్యానర్లో నిర్మాణం 
  • 'ఎన్.ఎస్.జి' కమాండో ఉన్నికృష్ణన్ కథ 
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ ఎంపిక 
Saiee Manjrekar signs for Mahesh Babus production
ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫిలిం మేకర్ మహేశ్ మంజ్రేకర్ కూతురు, 'దబాంగ్ 3' చిత్రం ద్వారా పేరుతెచ్చుకున్న సయీ మంజ్రేకర్ తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. అడివి శేష్ కథానాయకుడుగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న 'మేజర్' చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తోంది.

ప్రముఖ కథానాయకుడు మహేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 2008లో ముంబైలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల సందర్భంగా వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందిన ఎన్.ఎస్.జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ కథతో ఈ 'మేజర్' చిత్రం రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా దీనిని ఏకకాలంలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సగం షూటింగ్ పూర్తికాగా, సయీ మంజ్రేకర్ ఇందులో నటిస్తున్నట్టుగా ఈ రోజు ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రకథ వినగానే వెంటనే ఓకే చెప్పేశానని సయీ చెప్పింది. 'స్క్రిప్టుతో పాటు నా పాత్ర ఇంపాక్ట్ ఎలా వుందనేదే నాకు ముఖ్యం. అది నాకు ఈ మేజర్ స్క్రిప్టులో కనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను' అని చెప్పింది. మంచి అవకాశాలు వస్తే దక్షిణాది భాషల్లో చేయడానికి తనకి అభ్యంతరం లేదని ఈ చిన్నది తెలిపింది.