సజ్జల ప్రోత్సాహంతోనే కొడాలి నాని ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశాడు: వర్ల రామయ్య

24-09-2020 Thu 16:46
Varla Ramaiah alleges Sajjala the man behind Kodali Nani comments on PM Modi
  • బూతుల మంత్రి అంటూ వర్ల వ్యాఖ్యలు
  • నాని వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యిందన్న వర్ల
  • ప్రధాని కార్యాలయంతో బేరాలాడుతున్నారని వెల్లడి

తిరుమల డిక్లరేషన్ అంశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలంటూ బీజేపీ నేతలు పేర్కొంటుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని... ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని మోదీని సతీసమేతంగా వెళ్లి రామాలయం పూజ చేయమనండి... ఆ తర్వాతే బీజేపీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే బూతుల మంత్రి కొడాలి నాని ప్రధాని మోదీపై పూనకం వచ్చినట్టుగా కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ సీరియస్ అయ్యేసరికి... 'నానికి చదువు సంధ్యలు లేవని, అవగాహన లేక అటువంటి వ్యాఖ్యలు చేశాడని, అతడిని క్షమించండి అని ప్రధాని కార్యాలయంతో బేరమాడుతున్నారు' అంటూ వర్ల ఎద్దేవా చేశారు.