Dean Jones: ముంబయిలోని ఓ హోటల్లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ కన్నుమూత

Australia cricket legend Deab Jones dies of cardiac arrest
  • గుండెపోటుతో మరణించిన జోన్స్
  • సహచరులతో మాట్లాడుతుండగా ఛాతీలో నొప్పి
  • కుప్పకూలిపోయిన జోన్స్ ను ఆసుపత్రికి తరలింపు
  • మార్గమధ్యంలోనే చనిపోయాడన్న డాక్టర్లు
పరుగుల యంత్రంగా పేరుగాంచిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డీన్ జోన్స్ కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. డీన్ జోన్స్ గుండెపోటుతో మృతి చెందారు. ముంబయిలోని ఓ హోటల్లో ఉండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఐపీఎల్ పోటీలు యూఏఈలో జరుగుతున్నా, ముంబయిలోని స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో కామెంట్రీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా జోన్స్ స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాతల బృందంలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. కాగా, దక్షిణ ముంబయిలోని ఓ హోటల్ కారిడార్ లో ఇతర సహచరులతో ముచ్చటిస్తున్న ఆయన ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఆపై మరి లేవలేదు. వెంటనే అంబులెన్స్ లో హరికిషన్ దాస్ ఆసుపత్రికి తరలించారు.

మార్గమధ్యంలోనే జోన్స్ మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జోన్స్ మృతి చెందిన సమాచారాన్ని ఆస్ట్రేలియాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా, జోన్స్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశాలున్నాయి.

డీన్ జోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 80, 90వ దశకాల్లో అనేక వీరోచిత ఇన్నింగ్స్ లతో ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించారు. 1984లో టెస్ట్ కెరీర్ ఆరంభించిన జోన్స్ 52 మ్యాచ్ లు ఆడి 11 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 3,631 పరుగులు సాధించాడు. సగటు 46.55. ఇక వన్డేల్లో 164 మ్యాచ్ లు లు ఆడి7 సెంచరీలు, 46 ఫిఫ్టీల సాయంతో 6,068 రన్స్ నమోదు చేశాడు.

జోన్స్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ లలో నాటి మద్రాస్ టెస్టులో సాధించిన డబుల్ సెంచరీ కూడా ఆణిముత్యం వంటిదని చెప్పాలి. 1986-87 సీజన్ లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ మద్రాస్ లో టెస్టు మ్యాచ్ ఆడింది. విపరీతమైన వేడి వాతావరణాన్ని తట్టుకుని నిలబడిన జోన్స్ 210 పరుగులు సాధించాడు. డీహైడ్రేషన్ పరిస్థితి వచ్చినా జట్టు కోసం బ్యాటింగ్ కొనసాగించాడు. బ్యాటింగ్ ముగియగానే హాస్పిటల్ కు వెళ్లి సెలైన్ కట్టించుకున్నాడు.

జోన్స్ పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి జోన్స్ మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ రంగంలోనూ విషాదం నెలకొంది. ఆ ఆసీస్ దిగ్గజం ఇక లేరన్న వార్తతో ఆయనతో అనుబంధం ఉన్న మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Dean Jones
Death
Heart Attack
Cardiac Arrest
Australia
Cricket

More Telugu News