ఎప్పటికీ నిన్ను సంతోషంగా ఉంచుతానమ్మా: తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ

24-09-2020 Thu 16:05
Hero Vijay Devarakonda wishes his mother on her Birthday
  • హ్యాపీ 50 అంటూ తల్లికి విషెస్
  • వీడియో పోస్టు చేసిన విజయ్
  • బర్త్ డే పార్టీకి హాజరైన రష్మిక మందన్న

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తల్లి మాధవి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ ట్వీట్ చేశారు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానమ్మా అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా పోస్టు చేశారు.

అందులో విజయ్ దేవరకొండ, ఆయన తల్లి, సోదరుడు క్రికెట్ షాట్ కొడుతున్న సరదా సన్నివేశం చూడొచ్చు. హ్యాపీ 50 అమ్మా అంటూ విజయ్ పేర్కొన్నారు. తల్లి రియల్ లైఫ్ లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుందంటూ పైవిధంగా తెలియజేశారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు. ఆమె హైదరాబాదులో పలు వేదికలపై వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తుంటారు.

కాగా, విజయ్ తల్లి బర్త్ డే పార్టీకి ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న కూడా విచ్చేసింది. విజయ్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో రష్మిక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మాణంలో వచ్చే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ పై జరిగిన వాయు దాడుల్లో పాల్గొని శత్రు సైన్యం చేత చిక్కినా ఒక్క రహస్యం కూడా వెల్లడించకుండా మొక్కవోని తెగువ కనబర్చిన యుద్ధ విమాన పైలెట్ అభినందన్ భారత్ లో హీరో ఇమేజ్ సంపాదించుకోవడం తెలిసిందే.