బన్నీ సినిమా షూటింగ్ ఇక కేరళ అడవుల్లోనే!

24-09-2020 Thu 14:14
Allu Arjuns Pushpa shoot planned in Kerala forest
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' 
  • లాక్ డౌన్ కారణంగా అప్పట్లో షూటింగుకి బ్రేక్ 
  • నవంబర్ మొదటి వారం నుంచి తిరిగి షూటింగ్

లాక్ డౌన్ కారణంగా షూటింగుకి బ్రేక్ పడిన సినిమాలలో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా కూడా వుంది. 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బన్నీ తదుపరి చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'ను ప్రారంభించాడు. అటవీ వాతావరణంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రను పోషిస్తున్నాడు.

లాక్ డౌన్ కి ముందు బన్నీ లేని కొన్ని సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఇక బన్నీ కూడా షూట్ లో జాయిన్ అవుతాడనుకుంటున్న తరుణంలో లాక్ డౌన్ రావడం.. బ్రేక్ పడడం జరిగిపోయింది. దాంతో ఇక కేరళ అడవులను వదిలేసి మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్ చేద్దామని ఇటీవల ప్లాన్ చేశారు కూడా. అయితే, తాజాగా ఆ ఆలోచనను విరమించుకుని, తాము కోరుకున్న లొకేషన్లు వుండే కేరళకే వెళ్లాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో నవంబర్ మొదటి వారంలో కేరళ అడవుల్లో ఈ చిత్రం షూటింగును మొదలెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతాడు. కథానాయికగా అతని సరసన హాట్ బ్యూటీ రష్మిక నటిస్తోంది. రెగ్యులర్ గా సుకుమార్ ఇష్టపడే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని బాణీలను కూడా దేవిశ్రీ సిద్ధం చేశాడట.