సంజాయిషీలు ఇచ్చుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారు: యనమల విమర్శలు

24-09-2020 Thu 13:46
Yanamala comments on CM Jagan Delhi visit
  • సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల స్పందన
  • ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్ కు ఆనవాయితీ 
  • అప్పుల్లో ప్రపంచ రికార్డు స్థాపించారని ఎద్దేవా

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు చేసి ఢిల్లీ వెళ్లి చీవాట్లు తినడం జగన్ కు ఆనవాయితీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే తన కేసుల భవిష్యత్తే జగన్ కు ముఖ్యమని విమర్శించారు.

గత 16 నెలల్లో కేంద్రం నుంచి జగన్ ఏం సాధించుకొచ్చారో చెప్పాలని అన్నారు. 16 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల అప్పులు తేవడమే జగన్ రికార్డు అని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు 31 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో గిన్నిస్ రికార్డు నమోదు చేశారని, కానీ జగన్ నెలకు రూ.8 వేల కోట్ల అప్పులు తేవడంలో వరల్డ్ రికార్డు స్థాపించారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదాపై గగ్గోలు పెట్టిన వైసీపీ నోరు ఇప్పుడెందుకు మూతపడిందని యనమల ప్రశ్నించారు. ప్రత్యేకహోదా పేరెత్తడం జగన్ మర్చిపోయి 16 నెలలైందని విమర్శించారు. అయినా జగన్ ఢిల్లీ వెళ్లింది  సంజాయిషీలు ఇవ్వడానికే తప్ప రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి కాదని అన్నారు.